source: eenadu.net
లక్షలు పలికిన లడ్డూలు
హైదరాబాద్, రంగారెడ్డిజిల్లా, న్యూస్‌టుడే: హైదరాబాద్ శివారు, రంగారెడ్డి జిల్లాల్లో భూముల ధరలకు తగ్గట్టుగానే వినాయక లడ్డూల ఖరీదూ ఆకాశాన్నంటింది. బుధవారం ఓ లడ్డూ ధర రూ.9.09 లక్షలు పలికింది. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏటా ఈ జిల్లాల్లో వినాయకుని లడ్డూలను వేలం వేయడం పరిపాటి. ఈసారి వేలం పాటలో పాత రికార్డులన్నీ బద్దలైపోయాయి. గత ఏడాది వరకు ఇక్కడి చార్మినార్ సమీపంలోని బాలాపూరు వినాయకుడి లడ్డూనే అధిక ధర పలుకుతుండేది. ఈ ఏడాది ఆ లడ్డూని కేవలం రూ.3లక్షలకే పాడారు.అదే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెండ్యాలలో గణేశుని లడ్డూ అత్యధికంగా రూ.9.09 లక్షలు పలికింది. జె.హన్మంతరెడ్డి దీన్ని దక్కించుకున్నారు. ఇదే మండలం తుమ్మలూరులో లడ్డూను రూ.9.01 లక్షలకు... గ్రామానికి చెందిన జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు ఆమనగంటి నర్సిరెడ్డి సొంతం చేసుకున్నారు. మహేశ్వరంలో ఏర్పాటుచేసిన గణేశుని పూజా లడ్డూని జల్‌పల్లి సర్పంచు ఎస్.కృష్ణారెడ్డి రూ.7.22 లక్షలకు దక్కించుకున్నారు. చేవెళ్ల మండలం కమ్మెటలో లడ్డూ ధర 5.11 లక్షలకు పలికింది. సరూర్‌నగర్ మండలం బడుంగ్‌పేటలో రూ.6.25 లక్షలు, ఇదే మండలంలోని జిల్లెలగూడలో రూ.2.55 లక్షలకు గణేశ్ లడ్డూలు పలికాయి. యాచారంలో ఈసారి ఒక మైనారిటీ సోదరుడు రూ.13వేలకు వినాయకుని లడ్డూని సొంతచేసుకోవడం విశేషం. వీటిని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే తాము అధిక ధర చెల్లించేందుకు ముందుకొచ్చామని వేలంలో లడ్డూలు దక్కించుకున్న వారు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment
<< Home